సంఘ సంస్కర్త స్పూర్తి ప్రదాత పూలే
నివాళులు అర్పించిన పీఎం నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – మహాత్మా జ్యోతిబా పూలే జీవితం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యా బుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు . విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
పూలే జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. తమ ప్రభుత్వం పూలే ఆశయాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే తన జీవితాంతం పరితపించాడని ప్రశంసించారు. ఇదిలా ఉండగా పూలే అసలు పేరు జ్యోతి రావ్ గోవిందరావు పూలే. ఆయన ఏప్రిల్ 11, 1827లో మహారాష్ట్రలో పుట్టారు. నవంబర్ 28, 1890లో మరణించారు. తన జీవిత కాలమంతా పోరాటం చేశారు.
భారత దేశ చరిత్రలో చెరిగి పోని వ్యక్తిగా నిలిచి పోయారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా, కుల వ్యతిరేక సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం తనకు పూలే మార్గదర్శకుడు అని ప్రకటించారు.