ప్రజల కోసం రేయింబవళ్లు పని చేస్తున్నా
స్పష్టం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ
ఢిల్లీ – దేశం కోసం, ప్రజల కోసం తాను రేయింబవళ్లు పని చేస్తున్నానని స్పష్టం చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను ఎక్కడికి వెళ్లినా ఇంకా ఎందుకు పని చేస్తున్నారని అడుగుతుంటారని వారందరికీ నేను ఇచ్చే సమాధానం ఒక్కటే పని చేయడం తప్ప మరోటి తెలియదని అన్నారు మోడీ.
గత అయిదు సంవత్సరాలలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచాన్ని ఎంతో ఆందోళనకు గురి చేశాయని అన్నారు . భారత దేశం కలలను నిజం చేసేందుకు , దాని ప్రతిజ్ఞను, గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు ప్రధానమంత్రి.
మన దేశంలో గతంలో లాగా లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. చాలా మైలు రాళ్లను చేరుకున్నామని, ఇంకా చేరుకోవాల్సింది ఉందన్నారు మోడీ. గత 10 ఏళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందన్నారు. 16 కోట్ల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లను ఇచ్చామన్నారు. యువతీ యువకుల ఆశలను సజీవం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను తీసుకు వచ్చామని చెప్పారు పీఎం.
భారత దేశం ఇప్పుడు లుక్ ఫార్వర్డ్ విధానంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. నా లక్ష్యం ఒక్కటే 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలని అని పేర్కొన్నారు. (Couracy NDTV )