మేక్ ఇన్ ఇండియాకు 10 ఏళ్లు – మోదీ
మరోసారి గుర్తు చేసిన ప్రధానమంత్రి
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తను ఎక్కువగా ప్రేమించే పదం మేక్ ఇన్ ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి కారణం భారత దేశం స్వావలంబన సాధించాలనేది ఆయన సంకల్పం.
2014లో భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ కొలువు తీరారు. అంతకు ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అంచెలంచెలుగా గుజరాత్ మోడల్ పేరుతో దేశ వ్యాప్తంగా పేరు పొందారు. ఆ తర్వాత ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పుణ్యమా అని మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
చాయ్ పే చర్చా కార్యక్రమం పెద్ద ఎత్తున పాపులర్ అయ్యింది. పీఎంగా కొలువు తీరాక మేక్ ఇన్ ఇండియా కు శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ. దీనిని ప్రారంభించి సరిగ్గా ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మరోసారి ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా గురించి గుర్తు చేసుకున్నారు.
బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు మోడీ. గత దశాబ్ద కాలంగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు.
‘మేక్ ఇన్ ఇండియా’ మన దేశాన్ని తయారీ, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి సంకల్పాన్ని వివరిస్తుందన్నారు.