త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్
అమలుకు కేంద్ర సర్కార్ కసరత్తు
ఢిల్లీ – కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే గతంలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు (వన్ నేషన్ వన్ ఎలక్షన్ ) కు శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది.
ఈ విషయాన్ని గత నెల ఆగస్టు 15న జరిగిన స్వత్రంత్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట సాక్షిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తప్పనిసరిగా తీసుకు రానున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి. దీనిని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది కేంద్ర సర్కార్ కు. తొలి దశగా లోక్ సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏక కాలంలోనే ఎన్నికలు చేపట్టాలని సిఫార్సు చేసింది.
ఇందుకు సంబంధించి ప్యానెల్ కమిటీతో పాటు లా కమిషన్ కూడా సిఫారసు చేసే ఛాన్స్ లేక పోలేదు. లోక్ సభ, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనేది మోడీ ప్లాన్. మరి ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది వేచి చూడాలి. ఎన్నికలకు సంబంధించి రూ. 10,000 కోట్లు ఖర్చవుతోందని, దీనిని తగ్గించేందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే ఖర్చు తగ్గుతుందని మోడీ సర్కార్ భావిస్తోంది.