భారత్ అంటే పాకిస్తాన్ కు భయం
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
బీహార్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో సీఎం నితీశ్ కుమార్ తో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ దేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ పదే పదే బెదిరింపులకు పాల్పడేదని, ప్రత్యేకంగా టెర్రరిస్టులను దేశంలోకి పంపించేదని మండిపడ్డారు. కానీ తాను ప్రధానమంత్రిగా కొలువు తీరాక ఆ దేశం మన దరి దాపుల్లోకి రావాలంటే జంకేలా చేశానని చెప్పారు.
ఆ దేశం పూర్తిగా ఉగ్రవాదులకు అడ్డాగా మారి పోయిందని, ప్రస్తుతం భారత దేశం నుంచి సాయం కోసం ఎదురు చూస్తోందని ఎద్దేవా చేశారు. తాము ఏనాడూ యుద్దాన్ని కోరుకోలేదన్నారు. యావత్ ప్రపంచం బాగుండాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ప్రస్తుతం చాలా మంది పాకిస్తాన్ చెందిన ప్రజలు భారత్ ను చూసి నేర్చుకోవాలని అనుకుంటున్నారని , ఇది మన పనితీరుకు దక్కిన గౌరవమన్నారు. తమతో పోటీ పడాలన్నా లేదా యుద్దానికి దిగాలన్నా భయపడే స్థితికి తీసుకు వచ్చానని చెప్పారు.