రాజ్యాంగ స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫైర్
ఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగపు స్పూర్తికి కాంగ్రెస్ విఘాతం కలిగిస్తూ వస్తోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా ఆ పార్టీ మారి పోయిందని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు పీఎం. విచిత్రం ఏమిటంటే ఆ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాన్ని పదే పదే చూపించడం, దానిని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మీరే రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచింది కాక తమపై అభాండాలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు చేయలేని పనులను తాము చేశామన్నారు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్ లో మూడో స్థానానికి ఎగబాకుతోందని అన్నారు.
మీ హయాంలో దేశ వ్యాప్తంగా అవినీతి ఆక్టోపస్ లాగా విస్తరించిందని, కానీ తాము వచ్చాక అవినీతికి ఆస్కారమే లేకుండా చేశామని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. వ్యవస్థలను నీరు గార్చింది ఎవరో 143 కోట్ల భారతీయులకు తెలుసన్నారు . అందుకే ఆ పార్టీని జనం ఆదరించడం మానేశారని , తమకు పవర్ కట్టబెట్టారని చెప్పారు పీఎం.