కూటమి ప్రయత్నం ఫలించదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిపై సెటైర్లు వేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన జాతీయ మీడియాతో సంభాషించారు. కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాము దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషి చేశామని చెప్పారు.
ప్రజలు సమర్థవంతమైన నాయకుడిని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారని ఈ మేరకు ఈ రెండింటిని తాము కలిగి ఉన్నామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ పార్టీకి 543 సీట్లకు గాను 400కు పైగానే లోక్ సభ స్థానాలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు.
జూన్ 4 తర్వాత తాను తిరిగి మూడోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరడం తప్పదన్నారు. ఇది భారత దేశ చరిత్రలోనే మైలు రాయిగా నిలిచి పోతుందనడంలో సందేహం లేదన్నారు ప్రధానమంత్రి. ప్రతిపక్షాలకు ఎంత సేపు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు . దాని వల్ల తనకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కానీ ఇదే సమయంలో వారికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆలోచించడం లేదన్నారు.
పొద్దస్తమానం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ పోతే జనం ఎలా వారిని నమ్ముతారని ప్రశ్నించారు నరేంద్ర మోదీ.