విపక్షాల విమర్శలు మాకు ఆశీస్సులు
నిప్పులు చెరిగిన ప్రధాన మంత్రి మోదీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాలకు విమర్శించడం తప్ప వారికి ఏమీ చేత కాదన్నారు. ఇండియా కూటమి పల్చనై పోయిందంటూ ఎద్దేవా చేశారు.
ఈసారి కూడా బీజేపీ సంకీర్ణ సర్కార్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని దానిని తాము అందజేస్తున్నామని చెప్పారు.
ప్రతి సమావేశాలను అడ్డుకోవడం తప్ప విపక్షాలు చేసింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని ఆరోపించారు. తమపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు గుప్పించినా జనం తమ వైపు మాత్రం ఉన్నారని మరోసారి స్పష్టం చేశారని తెలిపారు.
పార్లమెంట్ కార్యకలాపాలను తరచూ అడ్డుకునే ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.