ఏర్పాట్లు సమీక్షించిన జిల్లా కలెక్టర్
విశాఖపట్నం – దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ ఏపీలోని విశాఖకు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారైంది. దీంతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ నిర్వహణ, ప్రజల సీటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖపట్టణం ఎంపీ ఎం. భరత్, పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వీఐపీల రాక, ప్రధాన మంత్రికి స్వాగతం ఏర్పాట్లు, రోడ్ షో, ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర కనీస వసతుల కల్పన తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు సలహాలు, సూచనలు అందజేశారు.
ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై ముందుగా జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారు కావున వారు ఉండేందుకు బస ఏర్పాట్లపై చేపట్టబోతున్న ప్రాథమిక చర్యలను వెల్లడించారు.
గవర్నర్ నోవొటెల్, ముఖ్యమంత్రి పోర్టు గెస్ట్ హౌస్ లో ఉండేందుకు ప్రాథమికంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం లేదా వాయు మార్గం ద్వారా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని వివరించారు.
వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చినట్లయితే టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు ప్రధాని రోడ్ షో ఉండొచ్చని పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ప్రాథమికంగా జిల్లా యంత్రాంగం నుంచి చర్యలు చేపడతున్నట్లు ప్రజా ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.