కలాం జీవితం చిరస్మరణీయం – మోడీ
జయంతి సందర్బంగా ఘనంగా నివాళి
ఢిల్లీ – భారత దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు దివంగత రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం అని కొనియాడారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్బంగా ఎక్స్ వేదికగా మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కలాంతో తనకు వ్యక్తిగత పరిచయం ఉందన్నారు. ఆయనతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు, చర్చించిన అంశాలు చాలా విలువైనవని పేర్కొన్నారు ప్రధాని మోడీ. కలాం జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశం రూపొందించడంలో, కలల్ని సాధించడంలో కలాం దార్శనికత , ఆలోచనలు ఎంతగానో ఉపయోగ పడ్డాయని ప్రశంసలు కురిపించారు మోడీ. అంతే కాదు భారతదేశాన్ని పటిష్టంగా, సుసంపన్నంగా, సమర్ధవంతంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని ప్రధాని పేర్కొన్నారు. మిసైల్ మ్యాన్ గా కలాం ఎల్లప్పటికీ గుర్తుండి పోతారని ప్రశంసించారు నరేంద్ర మోడీ. ఇదిలా ఉండగా అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు భారత దేశానికి 11వ రాష్ట్రపతిగా పని చేశాడు. అత్యంత సాధారణ జీవితం గడిపారు. అందుకే కలాంను ఈ దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడంటూ స్పష్టం చేశారు ప్రధాని.