పదవీ బాధ్యతలు స్వీకరించిన పొడపాటి తేజస్వి
ఏపీ రాష్ట్ర సృజనాత్మక..సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా
విజయవాడ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు పొడపాటి తేజస్వి. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు, శాసన సభ ఉప సభాపతితో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తేజస్వికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
విజయవాడ బెరం పార్క్ లోని హరితా హోటల్ లో తేజస్వి పొడపాటి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కళలకు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ లో సాంస్కృతిక పునరుజ్జీవం ఉద్భవించాలని ఆకాంక్షించారు కందుల దుర్గేష్.
ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా సృజనాత్మకతను వెలికితీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జానపద కళలను బ్రతికించేందుకు తేజస్వి, గుమ్మడి గోపాలకృష్ణలు సమ్మిళితంగా కలిసి పని చేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్టాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యులం అవుదామని పిలుపునిచ్చారు.
కల్చర్ క్వీన్ గా తేజస్వి బిరుదు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు శాసనసభ ఉప సభాపతి రఘు రామ కృష్ణంరాజు . సంస్కృతి, కళలు, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మంత్రి దుర్గేష్ అంటూ కితాబిచ్చారు.