తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం
తీర్మానం చేసిన టీటీడీ బోర్డు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. శ్రీవారి పవిత్రతను, ఆధ్యాత్మిక శాంతిని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా లేదా స్వామి వారికి భంగం కలిగించేలా మాట్లాడినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇవాల్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని కోరారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే కామెంట్స్ చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు చైర్మన్.
కేసులు నమోదు చేసి తీరుతామని హెచ్చరించారు. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య ఆలయంలో ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు, రాజకీయ నేతలు తిరుమలలో దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియా ముందు రాజకీయ, విద్వేష ప్రకటనలు చేస్తూ ఆధ్యాత్మిక విధ్వంసానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు గాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు బీఆర్ నాయుడు.