మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అమరావతి – అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశమును అర్థవంతంగా తెలియజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
నేడు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు.
ప్రతి రోజు దినపత్రికలు చదవటం అలవాటని, అన్ని వార్తలు చదవక పోయినా , అన్ని పేజీలలోని ఫోటోలను చూసి, ఆ వార్త లోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయ హస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు.
5 కేటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లుకు మేమెంటో, శాలువా, నగదు పురస్కారాల ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేసి , అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకిత భావంతో కష్ట పడతారని ప్రశంసించారు. తెలంగాణ పాలనలో మార్పు కు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యం లో అభయ హస్తం అమలుకు గత 8 నెలలుగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు కు ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఫోటోగ్రఫీ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు.
ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.