కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండం చేస్తారా
నిప్పులు చెరిగిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తారా అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. డబ్బులు ఉన్నాయనే అహంకారంతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అలా చేస్తే తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం గాజులు వేసుకొని లేరన్నారు. అగ్నిగుండం చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ పేరుతో సర్వ నాశనం చేసింది మీరు కాదా అని సీరియస్ కామెంట్స్ చేశారు. వ్యవస్థలను పక్కన పెట్టారని, ఏ ఒక్కరు ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పార్టీ పాలించిన కాలంలో కేవలం ఒకే ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ప్రజలు అందుకే పక్కన పెట్టారని, తమ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని పేర్కొన్నారు.