పవన్ కామెంట్స్ ను అలర్ట్ గా తీసుకోవాలి – నారాయణ
సీఎం..డిప్యూటీ సీఎంలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోం శాఖపై, ఆ శాఖను నిర్వహిస్తున్న మహిళ మంత్రి వంగలపూడి అనిత పట్ల దారుణంగా మాట్లాడటంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ఆందోళన వ్యక్తం చేశారని, దీనిని తాము కూడా సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా మంత్రివర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లకు పూర్తి హక్కు ఉంటుందన్నారు. ఎందుకంటే అన్ని నిర్ణయాలకు వారే బాధ్యత వహిస్తారని, అందుకే హోం శాఖపై కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని పవన్ కళ్యాణ్ ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు పొంగూరు నారాయణ.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కూటమి సర్కార్ లో అలజడి సృష్టించాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సమయంలో అనిత వంగలపూడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనిపై ఆమె ఇంకా స్పందించ లేదు. చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు.