నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చేస్తాం
ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి నారాయణ
అమరావతి – తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గురువారం జరిగిన శాసన సభలో ఎమ్మెల్యే పులివర్తి నాని పలు ప్రశ్నలు అడిగారు. ఇందుకు మంత్రి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పనుల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. వీటిపై విచారణ కూడా చేయిస్తామని అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాగు నీటికి ఇబ్బంది పడకుండా ఉండేలా చూడడం ప్రథమ కర్తవ్యమన్నారు. దీనిపైనే ఎక్కువగా దృష్టి సారించడం జరిగిందన్నారు పొంగూరు నారాయణ.
చెరువు పూడ్చివేతకు తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ) నిధులు మళ్లించడంతో పాటు చెరువు పూడ్చివేతతో తాగునీటి ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యే పులివర్తి నాని అడిగారు.
తుమ్మలగుంట చెరువు పూడ్చివేతలో నిబంధనలకు విరుద్దంగా చేసిన పనులపై చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు పొంగూరు నారాయణ. తుడా పరిధిలో ఉన్న చెరువును పూడ్చివేసి పార్కులు,ప్లే గ్రౌండ్ నిర్మాణం చేశారని ఆరోపించారు. టెండర్ల ద్వారా 102 పనులకు దాదాపు 40 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.