అమరావతిని నెంబర్ వన్ చేస్తాం
రెండున్నర ఏళ్లలో ప్రపంచంలోనే టాప్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొనుగూరు నారాయణ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆయనకు ముచ్చెమటలు పట్టించింది. ఒక రకంగా ఆయనపై కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేసింది. అయినా ఎక్కడా తల వంచ లేదు. గట్టిగా నిలబడ్డారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఏకంగా కేబినెట్ లో మరోసారి మంత్రిగా కొలువు తీరారు.
2014లో బాబు సర్కార్ లో సైతం ఆయన మున్సిపల్ శాఖ ను చేపట్టారు. ఆ తర్వాత జగన్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఆదివారం ముహూర్తం చూసుకుని మంత్రిగా కొలువు తీరారు పొనుగూరు నారాయణ. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.
త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించారు . సచివాలయం, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రపంచ టాప్-5 రాజధానుల్లో అమరావతి ఉండాలని చంద్రబాబు లక్ష్యమని చెప్పారు పొనుగూరు నారాయణ.