గిరిజన బాలికలకు పొన్నం భరోసా
కాలేజీని మార్చాలంటూ ఆదేశం
హుస్నాబాద్ – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ గిరిజన బాలికల కాలేజీ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థినులతో మంత్రి భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను మీకందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
అన్ని సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు మంత్రి. వసతి గృహానికి సంబంధించి కాంపౌండ్ వాల్ లేదని, నీళ్లు రావడం లేదని, తాగేందుకు సైతం తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు విద్యార్థినులు. బాలికలు కావడంతో భద్రత పట్ల మరింత ఆందోళన చెందుతున్నామని కన్నీటి పర్యంతం అయ్యారు.
స్పందించిన మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం పూర్తయినప్పటికీ కాలేజీ ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయ లేదని ప్రశ్నించారు.
రేపే కాలేజీని డిగ్రీ కాలేజీ నూతన భవనం లోకి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.