నీటి ఎద్దడి నివారణకు చర్యలు
155313 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి
హైదరాబాద్ – రోజు రోజుకు తెలంగాణలో పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. సాగు నీరుతో పాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ కూడా నీటి కోసం ఇబ్బందులు పడ కూడదని సూచించారు.
ఇదిలా ఉండగా ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడింది. చాలా చోట్ల నీరు దొరకక రోడ్లపైకి వస్తున్నారు జనం. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది సర్కార్. ఈ మేరకు టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది. రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ నీటి సమస్య ఉన్నా వెంటనే 155313 అనే నెంబర్ కు ఉచితంగా ఫోన్ చేయొచ్చని తెలిపింది.
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవి లో నీటి ఇబ్బంది ఏర్పడింది. ఒక్క హైదరాబాద్ లోనే 700 ట్్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూర్ లో నీటి నిలువలు ఉన్నాయని స్పష్టం చేశారు.. అయితే ప్రతిపక్షాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.