అభివృద్ది..సంక్షేమం మా నినాదం
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హుస్నాబాద్ – అభివృద్ది, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెంకేపల్లి – సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.
వివిధ గ్రామాలలో 18 పనులకు 75 లక్షల విలువైన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో కిచెన్ , షెడ్డు, టాయిలెట్ల నిర్మాణం, ఓపెన్ జిమ్ తో పాటు పలు అభివృద్ది పనులు ప్రారంభించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మంత్రి. తాము ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఆరు నూరైనా సరే ఒకటో తారీఖునే ఉద్యోగులందరికీ వేతనాలు ఇస్తున్నామని అన్నారు. గత సర్కార్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చేసిందని మండిపడ్డారు.
ఖాళీ చేతులతో ప్రభుత్వాన్ని అప్పగించిందని , తాము వచ్చాక సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇప్పటికే కొత్తగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.