బండి ప్రజలకు ఏం చేశావో చెప్పు
నిలదీసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ మధ్యే ఉండబోతోందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బీజేపీ మాజీ చీఫ్, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి సంజయ్ కుమార్ పటేల్ ను ఏకి పారేశారు.
ఆయనపై అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. వాటిని కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత బండిపై ఉందన్నారు. తాను కోట్లాది రూపాయల నిధులు తీసుకు వచ్చానని పదే పదే ప్రచారం చేసుకుంటున్నారని, అసలు కరీంనగర్ లోక్ సభ స్థానానికి ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎన్ని కోట్లు, దేని కోసం తీసుకు వచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
ఎదుటి వాళ్లపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్న బండికి ఈసారి ప్రజలు సరైన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. మతం పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.