విపక్షాల ఊబిలో నిరుద్యోగులు పడొద్దు
త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు విపక్షాల ఊబిలో పడ వద్దని కోరారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదే పదే ధర్నాలు, ఆందోళనలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. మీరు కోరిన విధంగా వాయిదాలు వేసుకుంటూ పోతే ఇంకా ఐదేళ్లు అయినా జాబ్స్ భర్తీ కావని స్పష్టం చేశారు. దయచేసి తమ మాటలను నిరుద్యోగ అభ్యర్థులు అర్థం చేసుకోవాలని కోరారు.
ఇదే సమయంలో గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావులు ఇప్పుడు నిరుద్యోగులు, జాబ్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
విద్యార్థులు, నిరుద్యోగుల తరపున మాట్లాడేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఇదే సమయంలో విజ్ఞులు, మేధావులతో కలిసి కూర్చుంటామని, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక నుంచి విలువైన సమయాన్ని పరీక్షల సన్నద్దం కోసం కేటాయించాలని, విపక్షాల రాజకీయాల ఉచ్చులోకి పడవద్దన్నారు.
హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.