ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ జిల్లా – రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. బహుజనులకు తాము పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ కుల గణన కోసం అసెంబ్లీ లో తీర్మానం చేసిన సందర్భంగా మంత్రిని సన్మానించారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు.
ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసిన వివిధ బీసీ కుల సంఘాలకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. మీ బిడ్డగా తనను ఆదరించినందుకు సంతోషంగా ఉందన్నారు. బలహీన వర్గాల మంత్రిగా ఇక్కడకి వచ్చానని , మీరంతా తనను ముందుండి నడిపించాలని కోరారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బలహీన వర్గాలకు న్యాయం చేసేలా తాను కృషి చేస్తానని చెప్పారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ముందు విద్యాధికులు కావాలని అన్నారు. అందుకే బహుజన బిడ్డలంతా చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు.