మాజీ సర్పంచ్ లు ఆందోళన చెందొద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కామెంట్
హైదరాబాద్ – ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సర్పంచ్ లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం పని చేసిందని ప్రశ్నించారు. ఎందుకు గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చ లేదో చెప్పాలన్నారు.
అంతా అయి పోయాక, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది చాలక ఇప్పుడు తమ సర్కార్ పై లేని పోని ఆరోపణలు చేస్తే ఎలా అని బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పొన్నం ప్రభాకర్ గౌడ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి సర్పంచల గురించి మాట్లాడటం, వారిపై ప్రేమ ఒలక బోయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. ఆనాడు అప్పులు చేసి పనులు చేపట్టినా బిల్లులు చెల్లించక పోవడంతో ఎంతో మంది సర్పంచ్ లు ఆత్మహత్యకు పాల్పడినా ఎందుకు స్పందించ లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మాజీ సర్పంచ్ లు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల చిల్లర రాజకీయాలను నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌబ్ కోరారు.