బండి కామెంట్స్ పొన్నం సీరియస్
నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్
హైదరాబాద్ – తనపై కరీంనగర్ ఎంపీ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణలు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికలు వస్తున్నాయని బండి రాజకీయ డ్రామాలకు తెర లేపాడంటూ ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీగా కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ఏం చేశావంటూ ప్రశ్నించానని, ఇందులో తప్పేముందని నిలదీశారు . ఐదేళ్ల పాటు కులం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్పా చేసింది ఏముందంటూ ఎద్దేవా చేశారు మంత్రి.
శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం మానేయాలని అన్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా ఇతరులపై రాళ్లు వేస్తే ఎలా అని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. తన తల్లిపై లేనిపోని కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని పేర్కొన్నారు.
రాజకీయ పరంగా తనపై రాళ్లతో దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అలాంటి సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే యాత్రలు చేపట్టే హక్కు ఉందన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విషయం మరిచి పోతే ఎలా అని ఎద్దేవా చేశారు . ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకుని బండి సంజయ్ మాట్లాడాలని హితవు పలికారు.