విచారణకు సహకరించడం లేదు
అనంతపురం జిల్లా – నటుడు పోసాని కృష్ణ మురళిపై 14 కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దళితుల్ని కించ పరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు వెల్లడించారు.
రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. తను సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయన్నారు. విచారణకు సహకరించ లేదని ఆరోపించారు. ఎన్ని సార్లు ప్రశ్నించినా తనకు ఏమీ తెలియదంటూ మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులను అనరాని మాటలు అన్నారు. ఆపై ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అధికారానికి దూరమైంది. దీంతో పోసాని పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.