ఆయన మరణం అత్యంత బాధాకరం
హైదరాబాద్ – ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ నావల్ టాటా ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఎందరో వస్తుంటారు పోతుంటారు..కానీ కొందరు మాత్రం కలకాలం గుర్తుండి పోయేలా నిలిచి పోతారని అన్నారు ప్రకాశ్ రాజ్. ఎన్నో సంస్థలను నెలకొల్పడమే కాకుండా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం మామూలు విషయం కాదన్నారు.
ఒకటా రెండా ఏకంగా వేల కోట్లు సమాజం కోసం ఖర్చు చేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు . చరిత్ర ఉన్నంత వరకు రతన్ నావల్ టాటా బతికే ఉంటారని, స్పూర్తి కలిగిస్తూనే ఉంటారని పేర్కొన్నారు ప్రకాశ్ రాజ్.
తన జీవితమే తన సందేశం అన్నట్టుగా తనను తాను మలుచుకున్న అద్భుతమైన నాయకుడు, దార్శనికుడు రతన్ టాటా అని తెలిపారు. దాతృత్వం, సహృదయత, వినయం , దయ , కరుణ కలిగిన ఏకైక వ్యక్తి ఆయన అని ప్రశంసించారు ప్రకాశ్ రాజ్. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.