ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. రోజుకో సంచలనం బయటకు వస్తోంది. కీలక మలుపు తిరుగుతుండడంతో కేసు పై మరింత ఉత్కంఠ నెలకొంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. హార్డ్ డిస్క్ లను, ల్యాప్ టాప్ లను ధ్వంసం చేసినట్లు రూఢీ అయ్యింది. అంతే కాకుండా సర్వర్స్ కూడా నిర్వహించినట్లు విచారణలో తేలింది. ప్రణీత్ రావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దందాలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఆనాటి దొర కేసీఆర్ చేసిన నిర్వాకానికి భారీ ఎత్తున మూల్యం చెల్లించు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఇద్దరు వరంగల్ లో పని చేస్తున్నట్లు టాక్.
విచిత్రం ఏమిటంటే ఆనాటి సర్కార్ లో కీలకమైన మంత్రి పదవిలో ఉన్న ఒకరు ప్రణీత్ రావు వ్యవహారం వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి తనను కావాలని ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సదరు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించేలా చేసే ఛాన్స్ లేక పోలేదని కొందరు పేర్కొంటున్నారు.