బీహార్ భవిష్యత్తు కోసమే పార్టీ ఏర్పాటు
ప్రకటించిన జన సురక్ష చీఫ్ ప్రశాంత్ కిషోర్
బీహార్ – ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్ ) వ్యవస్థాపకుడు, ప్రముఖ భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను గత 2 సంవత్సరాలుగా బీహార్ లో జన్ సురాజ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇది 720 రోజులకు పైగా కొనసాగింది. ప్రశాంత్ కిషోర్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు.
ఇదిలా ఉండగా బీహార్ లో జన సురాజ్ కు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున మేధావులు, నేతలు, ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ప్రసంగించారు.
బీహార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజలు బాగుండాలనే తాను ఈ పాదయాత్ర చేపట్టానని చెప్పారు. బీహార్లోని వేలాది గ్రామాలు, చిన్న పట్టణాల గుండా రెండు సంవత్సరాలకు పైగా కొనసాగిందన్నారు.
దశాబ్దాల కష్టాలను అంతం చేసేందుకు, బీహార్ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి తాము పార్టీ ఏర్పాటు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్.
అక్టోబరు 02న పార్టీని అధికారికంగా ప్రారంభించే ముందు ఎనిమిది మంది ఆఫీస్ బేరర్ల సమావేశంలో మొదటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.
రాబోయే రెండు నెలల్లో 1.5 లక్షల మంది జన్ సురాజ్ ఆఫీస్ బేరర్లు కలిసి “సంస్థాపక సదస్సు”లో లక్షలాది మంది పాల్గొంటారని తెలిపారు. పార్టీకి సంబంధించి ముఖ్య ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అయితే తాను పార్టీలో ఏ పదవిని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్.