ఆగస్టు మొదటి వారంలో గవర్నర్ల సదస్సు
అధ్యక్షత వహించనున్న రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ – ఆగస్టు తొలి వారంలో దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక భేటీ ఆగస్టు 2,3 తేదీలలో గవర్నర్లు పాల్గొనున్నారు.
ఈ కీలక సమావేశానికి దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ , ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరుగనుంది.
వివిధ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రధానంగా నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, మై భారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష్ మాకే నామ్ అంశాలపై చర్చిస్తారు.
సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం తదితర అంశాలపై అవగాహన కలిగించనున్నారు. ఈ సదస్సులో గవర్నర్లు బృందాలుగా విడిపోయి కీలక అంశాలపై చర్చించనున్నారు. అజెండాలోని అంశాలపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించనున్నారు.