బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రీకారం
రంగారెడ్డి జిల్లా – రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. దీంతో కొత్తగా రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే 17 ఎంపీ స్థానాలను గెలుచు కోవాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ అన్నింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు.
ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈనెల 27న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గృహ జ్యోతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనుందని తెలిపింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వీటిలో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసింది. తాజాగా మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టనుంది.