దేశం చూపు కూటమి వైపు
ప్రియాంక గాంధీ పిలుపు
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ భారత దేశం అంతా ప్రస్తుతం భారత కూటమి వైపు చూస్తోందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మోదీ పదేళ్ల పాలనలో దేశం మరింత వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన వనరులను విధ్వంసం చేసిన ఘనత ప్రధాన మంత్రి మోదీకి దక్కుతుందని ఆరోపించారు. కేవలం కొద్ది మంది పెట్టుబడిదారులకు మేలు చేసేలా ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రియాంక గాంధీ.
యువత కోసం రూ. 5,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్‌లకు సంవత్సరానికి రూ. 1 లక్ష అప్రెంటిస్‌షిప్ తో కూడిన వేతనం అందజేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. జీఐజీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం తమ బాధ్యత అని, రాబోయే రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తప్పదన్నారు ప్రియాంక గాంధీ.