విద్యార్థులపై లాఠీఛార్జి దారుణం
ఢిల్లీ – విద్యార్థులపై బీహార్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ప్రియాంక గాంధీ. మూడు రోజుల వ్యవధిలో విద్యార్థులపై దాడులకు దిగడం దారుణమన్నారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్, పేపర్ లీక్‌లను అరికట్టడంలో విఫలమైందని ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం, వాటర్ క్యాన్లు ఉపయోగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు ప్రియాంక గాంధీ. విద్యా రంగం పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందని, దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడం పరిపాటిగా మారిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం అనేది పనిగా పెట్టుకున్నారంటూ వాపోయారు ప్రియాంక గాంధీ. ఇలా ఎంత కాలం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తారంటూ నిలదీశారు.