మోదీ నిర్వాకం దేశం సర్వ నాశనం
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
ఉత్తర ప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వాకం , అసమర్థ పాలన కారణంగా ఈ దేశం సర్వ నాశనమైందని ధ్వజమెత్తారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ పదేళ్ల కాలంలో ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కనీసం 40 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఒక్క ఖాతాలో ఒక్క రూపాయి వేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు ప్రియాంక గాంధీ.
నల్ల ధనం వెలికి తీస్తానని అన్నారని, కానీ అవినీతి, అక్రమార్కులకు అండగా నిలిచారని, వారినే పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు.