మోదీ హామీల ఊసేది..?
ప్రియాంక గాంధీ ఫైర్
ఉత్తరప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం యూపీలోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీ, రోడ్ షోను ఉద్దేశించి ప్రసంగించారు.
అబద్దాలు చెప్పడంలో దేశంలోనే నెంబర్ వన్ మోదీ అంటూ మండిపడ్డారు. ఆయన తన వ్యక్తిగత ప్రచారంపై ఫోకస్ పెట్టడం తప్పితే ఈ పదేళ్ల కాలంలో దేశానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ.
ఇవాళ దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన చెందారు. రాజకీయాలను పూర్తిగా కలుషితం చేశారని మండిపడ్డారు. కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు నరేంద్ర మోదీ లాగా ఏనాడూ అబద్దాలు చెప్పలేదన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ.
కానీ మోదీ నిత్యం అబద్దాలు చెప్పడం, ప్రజలను నమ్మించడం ఆ తర్వాత అధికారంలోకి రావడం ఇదే పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఒక రకంగా గోబెల్స్ ప్రచారంలో టాప్ మోదీ అంటూ ఫైర్ అయ్యారు.