మోడీ కామెంట్స్ ప్రియాంక సీరియస్
గాంధీ గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఆయనకు తన స్వంత ప్రచారం తప్ప దేశం గురించి ఏ మాత్రం అవగాహన లేదన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఈ దేశం కోసం ఎందరో బలిదానం చేశారని, మరికొందరు తరాలు మారినా నేటికీ ప్రభావితం చేస్తూనే ఉంటారని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఒక ఆంగ్లేయుడు సినిమా తీసేంత దాకా భారతీయులకు ఆయనంటే ఎవరో కూడా తెలియదని మోడీ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ప్రియాంక గాంధీ.
ఇది ఒక రకంగా మోడీ అవివేకానికి, అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోందని అన్నారు. మోడీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన రోజు రోజుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు . మోడీ తెలుసు కోవాల్సింది చాలా ఉందన్నారు. ప్రపంచం మొత్తానికి గాంధీ అంటే తెలుసన్నారు. అనేక దేశాల స్వతంత్ర ఉద్యమాలు కూడా ఆయన స్పూర్తితో నడిచాయని స్పష్టం చేశారు.