తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసే స్వామి వారి గరుడ సేవ అక్టోబర్ 8 మంగళవారం జరగనుంది. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు గాను హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది.
సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
చెన్నైకి చెందిన తిరుపతి అంబ్రాలా చారిటిస్ ట్రస్టీ శ్రీ వరదరాజులు 11 గొడుగులను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.