NEWSTELANGANA

తెలంగాణ జాతిపితా జ‌య‌హో

Share it with your family & friends

జ‌య‌శంక‌ర్ సారు జ‌యంతి

హైద‌రాబాద్ -జ‌యశంక‌ర్ సారు జ‌యంతి ఇవాళ‌. తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా నిలిచిన గొప్ప వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా ఆయ‌న ఈ ప్రాంతానికి జాతిపిత‌. కాద‌న‌డానికి ఎవ‌రికి అభ్యంత‌రం ఉంటుంది క‌నుక‌. ఎందుకంటే తెలంగాణ ఎలా మోస పోయిందో, ఎలా దోపిడీకి గురైందో, నీళ్లు, నిధులు, నియామ‌కాలు, భూములు ఎట్లా విధ్వంసానికి లోన‌య్యాయో ఆయ‌న చెప్పిన తీరు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ పాఠాలుగా నిలిచి పోతాయి.

తన జీవిత కాల‌మంతా తెలంగాణ కోసం ప‌రిత‌పించిన మ‌హానుభావుడు. విశ్వ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం వ‌ల్ల‌నో ఏమో కానీ ఆయ‌నకు రావాల్సినంత ప్ర‌చారం రాలేదు. కొన్ని త‌రాల పాటు ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సారు ప్ర‌భావితం చేశారు. రాబోయే త‌రాల‌ను కూడా ప్ర‌భావితం చేస్తూనే ఉంటారు.

ఆయ‌న న‌డిచిన బాట ఎంతో గొప్ప‌ది. ఎంత‌టి క్లిష్ట‌మైన అంశ‌మైనా, విష‌య‌మైనా స‌రే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల‌కు సైతం అర్థ‌మ‌య్యేలా చెప్ప‌గ‌లిగే తెలివి తేట‌లు స్వంతం చేసుకున్న మేధావి. అంత‌కు మించిన మాన‌వ‌తా వాది. కేవ‌లం తెలంగాణ కోసం పెళ్లి చేసుకోకుండా బ‌తుకు అంకితం చేసిన జ‌య‌శంక‌ర్ సారును జ్ఞాప‌కం చేసుకోవ‌డం నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం క‌ర్త‌వ్యం.