DEVOTIONAL

తిరుమ‌ల ప‌విత్ర‌తకు ప్రాధాన్య‌త – టీటీడీ చైర్మ‌న్

Share it with your family & friends

భక్తులు సేవకు సమిష్టిగా కృషి చేయాలి

తిరుమల – ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడు కోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యత అని టీటీడీ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్. నాయుడు స్ప‌ష్టం చేశారు. చైర్మ‌న్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునే వాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు సేవ చేసేందుకు మీడియాతో సహా ప్రతి ఒక్కరూ తోడ్పాటు నందించాలని కోరారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెలలో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమిష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

అంతకు ముందు టీటీడీ సీనియర్ అధికారులందరితో చైర్మన్ పరిచయ సమావేశం నిర్వహించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు టీటీడీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమర్పించారు. తిరుమల ఆలయం, స్థానిక దేవాలయాలు, అన్న ప్రసాదం, విజిలెన్స్, ఆరోగ్యం, రవాణా, ఐటి, గోశాల, ఉద్యానవనం, అటవీ శాఖ, విద్యా సంస్థలు ప్రాముఖ్యతను వివరించారు.

ఆసుపత్రులు, మెడికల్, పిఆర్ వింగ్, రిసెప్షన్, కళ్యాణకట్ట, హిందూ ధార్మిక ప్రాజెక్టులు, యాత్రికుల దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను చూసుకోవడంతో పాటు తమ నిబద్ధతతో సంస్థ ఖ్యాతిని అన్ని స్థాయిలలో ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగులు అంకితభావంతో ఉన్నారని ఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిఎల్‌ఓ వరప్రసాదరావు, సిఈ సత్యనారాయణ, పలువురు బోర్డు సభ్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.