డేరా బాబాకు కోర్టు ఊరట
లైంగిక..హత్యా నేరాలు
హర్యానా – ఈ దేశంలో బాబాల పేరుతో జరుగుతున్న దోపిడీ, హత్యలు, లైంగిక వేధింపులకు లెక్క లేకుండా పోతోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు హర్యానాకు చెందిన డేరా బాబా. ఇదిలా ఉండగా ఆయన పలు నేరాలకు సంబంధించి జైలులో కొనసాగుతున్నాడు. నిందితుడిగా ఉన్న ఈ బాబాకు మద్దతు తెలుపుతున్నది ఎవరో కాదు కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2002లో జరిగిన డేరా బాబా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్, మరో నలుగురిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
మేనేజర్ రంజిత్ అనే వ్యక్తి రామ్ రహీమ్ అకృత్యాలను బయట పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి, డేరా హెడ్ మహిళలను ఎలా లైంగికంగా దోపిడీకి గురి చేస్తున్నారో, పురుషులను ఎలా వాడుకున్నాడో వివిరించే లేఖను ప్రసారం కూడా చేశారు.
సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి తన వార్తా నివేదికలో సంచలన లేఖ ప్రచురించాడు. ఆ తర్వాత తను దారుణ హత్యకు గురయ్యాడు. దీని వెనుక డేరా బాబా ఉన్నాడని తేలింది. దీంతో ఈ కేసులో డేరా బాబాకు శిక్ష పడింది.
జర్నలిస్టు హత్య, ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాను నపుంసకుడినని పేర్కొంటూ అత్యాచారం నేరాన్ని హైకోర్టులో సవాలు చేశారు.