రిలీజ్ కాకుండానే పుష్ప-2 రికార్డ్
రూ. 1000 కోట్ల మార్క్ దాటిన మూవీ
హైదరాబాద్ – తెలుగు సినిమా రేంజ్ ఇండియాను దాటేసింది. స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారి పోయారు. దీంతో వారి మార్కెట్ ఒకే రోజులో పెరిగి పోయింది. ఊహించని ధరకు సినిమా రైట్స్ అమ్ముడు పోతున్నాయి. ఎవరి అంచనాలలో వారు ఉన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ ధమాకా హీరోగా పేరు పొందిన అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పటికే రష్మిక మందన్నాతో కలిసి నటించిన పుష్ప దుమ్ము రేపింది. రికార్డుల మోత మోగించింది. దేశ వ్యాప్తంగా కోట్లు కుమ్మరించింది. నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.
దీంతో డైరెక్డర్ సుకుమార్ మరోసారి కళ్లు చెదిరేలా, ఆకట్టుకునేలా పుష్ప -2 ప్లాన్ చేశాడు. ప్రస్తుతం శర వేగంగా అది షూటింగ్ జరుపుకుంది. రిలీజ్ డేట్ కూడా డిక్లేర్ చేశారు సినిమా నిర్మాతలు. సినిమాకు సంబంధించి రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం వచ్చిన ప్రాఫిట్ లో 27 శాతం హీరోకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు టాక్.
ఇంకా రిలీజ్ కాకుండానే పుష్ప -2 మూవీ ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్ దాటిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సినిమాను వచ్చే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పుష్ప2 ట్రైలర్ , పాటలు దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగిందని నిర్మాత ఒప్పుకున్నారు.
అయితే ఎంత అని మాత్రం బయటకు చెప్పలేదు. థియేట్రికల్ హక్కుల పరంగా రూ. 600 కోట్లు, ఓటీటీ హక్కుల ద్వారా రూ. 275 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ. 85 కోట్లు, మ్యూజికల్ రైట్స్ రూ. 65 కోట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం.