శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప
తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది.
వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయం ఇచ్చారు.
అంతకు ముందు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కలిసి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ జె.శ్యామల రావు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.