శోభాయమానం పుష్ప యాగం
అప్పలాయగుంటలో అద్భుతం
తిరుపతి – ప్రముఖ పుణ్య క్షేత్రం అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న లక్ష్మీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్ప యాగం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఆలయంలో గత జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూల మూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వ భూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని కొలువు తీర్చారు.
మధ్యాహ్నం 2.40 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్ప యాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్ప యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయ మానంగా సాగిన ఈ పుష్ప యాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.