సప్తవర్ణ శోభితం శ్రీపద్మావతి పుష్పయాగం
ముగిసిన అమ్మ వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అంతకు ముందు అమ్మ వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ పద్మావతికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మ వారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, ఒక టన్ను ఆంధ్రప్రదేశ్, ఒక టన్నుకర్ణాటక రాష్ట్రాల నుండి అందించారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.
ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.