బీసీల కోసం ఉద్యమం – కృష్ణయ్య
మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ ఉద్యమ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య. ఆయన గతంలో పలు సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. దేశంలో బీసీ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణలో ఓ వైపు మాదిగల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పేరు పొందితే ఇంకో వైపు బీసీలంటేనే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆర్. కృష్ణయ్యగా మార్చుకున్నారు.
ఉద్యమ నాయకుడిగా ఉన్న ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పిలిచి రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. తాజాగా ఆయన ఎంపీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. ఎవరైనా ఎంపీ పదవిని ఒదులుకునేందుకు ఇష్ట పడరు. కానీ ఆయన మాత్రం సంచలన నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆలోచనలో పడేసేలా చేసింది.
ఇదిలా ఉండగా బుధవారం ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
ఉద్యమం బలోపేతం చేస్తేనే బీసీలకు న్యాయ పరమైన వాటా లభిస్తుందన్నారు. తమ ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా ఆర్. కృష్ణయ్యను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కలిశారు. తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు.