ఎస్పీ బదిలీపై భగ్గుమన్న వైసీపీ
కావాలనే బదిలీ చేశారని ఫైర్
కడప వైఎస్సార్ జిల్లా – వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను అర్ధాంతరంగా బదిలీ చేసిందంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కనీసం ఆయన పదవి బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదన్నారు. ఈ జిల్లా ప్రజల పక్షాన తాము ప్రశ్నిస్తున్నామని, .ఎందుకు అర్ధాంతరంగా జిల్లా ఎస్పీని బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
రూల్స్ ప్రకారం ఐఏఎస్ లను, ఐపీఎస్ లను రెండు సంవత్సరాల తర్వాత బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడైనా లంచగొండి, అవినీతిపరులను, అసమర్ధుడై, లా అండ్ కంట్రోల్ చేయలేకపోతే బదిలీ చేస్తారని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
బదిలీ అయిన ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఇవేవీ వర్తించవని, ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు ఇక్కడికి వచ్చిన తర్వాత జూదం, అక్రమ ఇసుక రవాణా, మట్కా, గ్యాంబ్లింగ్లు అరికట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు.
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా చట్టాన్ని వర్తింపజేసిన ఎస్పీ హర్షవర్థన్ రాజును బదిలీ చేయడం దారుణమన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు నిజాయితీ ఏ ఎమ్మెల్యేలకు నచ్చకనే బదిలీ వేటు వేశారంటూ ఆరోపించారు. కూటమి నేతలకు ఆయన మింగుడు పడడం లేదన్నారు.