డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు
అమరావతి – ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డి పనై పోయిందన్నారు. వైసీపీ నుంచి కీలక నేతలు తప్పు కోవడం ఖాయమన్నారు. ఆ పార్టీ ఖాళీ అవుతుందని, జగన్ రెడ్డి ఒక్కడే మిగిలి పోతాడని జోష్యం చెప్పారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలంతా తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. బుద్ది ఉన్న వాడు ఎవరూ జగన్ తో ఉండరన్నారు. విజయసాయి రెడ్డే కాదు ఇంకొందరు కూడా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారన్నారు.
రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు. తన కస్టడీ కేసు గురించి కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఒత్తిళ్లు, కేసులు, అరెస్ట్ లతో గడిచిందన్నారు. ప్రశ్నిస్తే చాలు జైలుకు పంపించేలా చేశాడంటూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై.
వైసీపీలో నెంబర్ 2గా పేరు పొందిన సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా త్వరలోనే ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమన్నారు రఘురామ కృష్ణం రాజు. జగన్ రెడ్డి తనంతకు తాను ఓ మోనార్క్ నని భావిస్తాడని, ఆయనతో ఏ ఒక్క నేతకు పొసగదన్నారు. తను చెప్పిందే వినాలని అనుకుంటారని, అందుకే జనం 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.