రఘురామకృష్ణంరాజుకు అభినందన
డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభా పతి (డిప్యూటీ స్పీకర్ ) గా గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
ఇదిలా ఉండగా శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన రఘు రామకృష్ణరాజును స్వయంగా బాబు, పవన్ , మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభాపతి స్థానం వరకు తీసుకెళ్లారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సమక్షంలో స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ కృష్ణంరాజు వన్నె తేవాలని, సభను సమున్నతంగా నడపాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. రాజకీయాలలో అపారమైన అనుభవం కలిగిన నాయకుడని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం సభను నడిపేందుకు మరింత ఉపకరిస్తుందని చెప్పారు ఏపీ సీఎం.
ఈ సందర్బంగా తనను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నందుకు, తనపై గురుతరమైన బాధ్యతను మోపినందుకు తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు. సభకు వన్నె తీసుకు వచ్చేలా తాను నడుచుకుంటానని చెప్పారు.