మాజీ పీసీసీ చీఫ్ రఘు వీరా రెడ్డి
అనంతపురం జిల్లా – మాజీ ఏపీసీసీ చీఫ్ నీలకంఠాపురం రఘు వీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ప్రస్తుతం కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం పేద విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హత కలిగిన పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే విధంగా నూతన ప్రభుత్వ వైద్య కాలేజీ లలో గత ప్రభుత్వం 50 శాతం సీట్లు మేనేజ్ మెంట్ కోటా క్రింద అనుమతిస్తూ తీసుకు వచ్చిన జీవో నెంబర్ 107, 108 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీలకంఠాపురం రఘు వీరా రెడ్డి.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారని, రద్దు చేయాలని డిమాండ్ కూడా చేశారని అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక దానిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మాజీ ఏపీ పీసీసీ చీఫ్.
సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి నెల రోజులు పూర్తవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి. రద్దు చేయాలని కోరుతూ తాను పలుమార్లు లేఖలు కూడా రాయడం జరిగిందని తెలిపారు.