అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ
ప్రకటించిన కాంగ్రెస్ నేత రాహుల్
పంజాబ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం కీలకమైనదని పేర్కొన్నారు. మోడీ సర్కార్ కోటీశ్వరుల , ఆర్థిక నేరస్థుల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. కానీ తాము వచ్చాక ఆరుగాలం పండించే రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇదే తొలి సంతకం ఉంటుందన్నారు.
రైతులు అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారని ఆవేదన చెందారు. మోడీ సర్కార్ కావాలని రైతుల పట్ల వివక్షను ప్రదర్శించిందని ఆరోపించారు. రైతులు ప్రాణాలు కోల్పోయినా పట్టించు కోలేదని ఆవేదన చెందారు. రైతు వ్యతిరేక చట్టాలను ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతు రుణాల మాఫీకి సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు రాహుల్ గాంధీ. ఇందు కోసం పేరు కూడా పెట్టామన్నారు. కిసాన్ కర్ణా మాఫీ ఆయోగ్ అని తెలిపారు.